వైద్య విద్యార్థులు సేవాభావం పెంపొందించుకోవాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: వైద్య విద్యార్థులు ప్రారంభం నుంచే సేవాభావం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Bhavesh Mishra) అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026 బ్యాచ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వైట్ కోట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతనంగా వైద్య విద్యను ప్రారంభించబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండి, ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా తమ వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలన్నారు. మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండి చక్కగా చదువుకోవాలని సూచించారు. సమయపాలన ముఖ్యమని తెలిపారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ వారిలో ఉత్తేజం నింపారు. భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నిబద్ధతతో పేదలకు మంచి వైద్యం అందించాలని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తమ విద్యను సాగించాలన్నారు.

వైద్య విద్యార్థుల సౌకర్యార్థం బస్సును ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. కళాశాలలో ప్రస్తుతం ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ కేంద్రాన్ని అతి త్వరలోనే అనువైన ఇతర ప్రదేశానికి మారుస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులకు కోటు, స్టెతస్కోప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ సి.వి శారద, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>