కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె కొండా సుస్మిత పరకాల సీటు విషయమై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు మంత్రి కొండా సురేఖ గురువారం తన వివరణతో లేఖను కమిటీ ఛైర్మన్ మల్లు రవి పంపించారు. లేఖలో తన వివరణ ద్వారా స్పష్టతనిచ్చారు. ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించారన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టారని లేఖలో ప్రస్తావించారు. తన స్వస్థలమైన గీసుకొండతో తన కూతురు సుస్మితా పటేల్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారని వివరించారు.
ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని కొండా సురేఖ స్పష్టత ఇచ్చారు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం న్యాయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ రిక్వెస్ట్ చేశారు.

