కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఎట్టకేలకు కొండా దంపతుల వ్యాఖ్యలతో సస్పెన్స్‌కు తెరపడింది. కొండా సురేఖ (Konda Surekha) బర్తరఫ్ తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్‌పై జోరుగా చర్చలు సాగాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో కొనసాగుతారా? ప్రత్యామ్నాయ రాజకీయ దారి ఎంచుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా ఢిల్లీ అధిష్ఠానం నుంచి సురేఖకు పిలుపు వచ్చింది.
వెంటనే తన భర్త మురళితో కలిసి కేడర్, అభిమానులతో సురేఖ మీటింగ్ నిర్వహించడం ద్వారా భవిష్యత్ రాజకీయ దిశపై కొంత స్పష్టత ఇచ్చినట్లైంది. కాంగ్రెస్‌ను వీడేది లేదని కొండా దంపతులు బహిరంగంగా ప్రకటించడం కీలకంగా మారింది. పదవులు శాశ్వతం కాదని, కార్యకర్తలే తమ బలమని చెప్పడం ద్వారా, తన బర్తరఫ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదనే సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధిష్ఠానం పిలుపు తర్వాతే యాక్టివ్..
సురేఖను అధిష్ఠానం పార్టీలోనే కొనసాగాలని, వరంగల్‌లో పార్టీ బలోపేతానికి పని చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా అందరినీ కలుపుకొని పనిచేయాలని సూచించినట్లు సమాచారం. తద్వారా ఇప్పటివరకు సురేఖ రాజకీయ భవిష్యత్‌పై సాగిన ఊహాగానాలకు కొంతమేర తెరపడినట్లైంది. ఇదే సమయంలో కొండా దంపతులు మళ్లీ నియోజకవర్గంలో తమ రాజకీయ బలం చాటుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారనే టాక్ లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి మళ్లీ తానే గెలుస్తాననే ధీమాను సురేఖ వ్యక్తం చేశారు. మంత్రిని కూడా అవుతానని చెప్పడం ద్వారా తన రాజకీయ భవిష్యత్ లక్ష్యంపై స్పష్టత ఇచ్చారు.
25 సీట్ల గెలుపు వెనుక లెక్కేంటి?
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గం 25 స్థానాల్లో గెలుస్తుందని సురేఖ ధీమా వ్యక్తం చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం గెలుపుపై నమ్మకం వ్యక్తం చేయడమేనా? లేక తూర్పున కేడర్ బలం అధిష్ఠానం, ప్రత్యర్థి వర్గాలకు చూపే రాజకీయ సందేశమా? అనే చర్చ ఊపందుకుంది.
ఎవరికి టికెట్లు దక్కుతాయి? అభ్యర్థుల ఎంపికలో ఏ వర్గానికి ప్రాధాన్యం ఉంటుంది? ప్రచార బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? వంటి అంశాలు కొండా, ఎమ్మెల్సీ సారయ్య వర్గాల మధ్య భవిష్యత్ సంబంధాలను నిర్ణయించే ఛాన్స్ ఉంది. కొండా దంపతుల రాజకీయ బలం ప్రధానంగా వ్యక్తిగత అనుచరగణం, అభిమానులు, దీర్ఘకాలంగా తమతో ఉన్న కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుంది.
అధిష్ఠానం మాట నిలుపుతారా?
ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. అధిష్ఠానం సురేఖను పార్టీతోనే కొనసాగించాలని భావిస్తే.. తూర్పున ఇతర వర్గాలతో సమన్వయం చేయడం అత్యంత కీలకం. లేకపోతే ఒకే పార్టీలో రెండు రాజకీయ కేంద్రాలు ఏర్పడే పరిస్థితి రావచ్చు. కొండా దంపతులు కూడా కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేసినందున తమ రాజకీయ ప్రాధాన్యాన్ని తిరిగి బలోపేతం చేసుకోవడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ వర్గం కూడా ఎలా స్వీకరిస్తుందనేది కీలకంగా మారింది.
అయితే రాజకీయ ప్రకటనల కంటే క్షేత్రస్థాయిలో రెండు వర్గాల మధ్య సమన్వయం ఎంతవరకు సాధ్యమవుతుందనేదే అసలు ప్రశ్న. ఇప్పుడు తూర్పు కాంగ్రెస్‌లో ఒక్కటే చర్చ నడుస్తోంది. కొండా దంపతులు పార్టీతో కలిసి నడుస్తారా? లేక పార్టీలోనే కొనసాగుతూ తమ వర్గ రాజకీయాన్ని బలోపేతం చేస్తారా? లేదా.. రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగితే ప్రత్యర్థులకు లాభమా? అనేది స్థానిక ఎన్నికలే తేల్చనున్నాయి.
తాజా వ్యాఖ్యలు.. తీవ్ర చర్చనీయాంశం
కొండా దంపతుల తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య రాజీనామా చేయమని ఎలా అంటారని సురేఖ ప్రశ్నించడం ద్వారా పార్టీలోని అంతర్గత విభేదాలు పూర్తిగా సమసిపోలేదనే చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు స్థానిక నేతల మధ్య మాటల యుద్ధం ఇలానే కొనసాగితే అది పార్టీకి ఇబ్బందికరంగా మారే చాన్స్ లేకపోలేదనే వాదన కూడా ఉంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండగా విభేదాలు మరింత బహిరంగమైతే కేడర్ అయోమయంలో పడే పరిస్థితి ఏర్పడవచ్చనే ప్రచారమూ జోరందుకుంది.

