కలం, తెలంగాణ బ్యూరో: 22-ఏ నిషేధిత భూముల జాబితా విషయంలో నిన్నమొన్నటి వరకు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ (BRS) ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. ధరణి రాకముందు, వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల పేరుతో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదాహరణలు, వివరణలతో సహా వివరించడంతో గులాబీ లీడర్లు ఇరకాటంలో పడ్డారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరుల భూ లావాదేవీలకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పొంగులేటి లేవనెత్తిన అంశాలపై హరీశ్ రావు కౌంటర్ ఇచ్చినా.. అది సమర్థించుకునే ధోరణిలోనే ఉంది తప్ప పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేదు.
ఇప్పటివరకు 22-ఏ బాధితుల కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా హెల్ప్ లైన్, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. అయితే ఇదే అంశంలో హరీశ్ రావు తన రాజకీయ పలుకుబడితో మామకు సాయం చేశారనే విషయం తెరపైకి రావడంతో.. బాధితులకు అండగా నిలుస్తామని చెప్పిన ఆ ప్రయత్నమే ఇప్పుడు ప్రశ్నల మధ్య నిలిచింది.
మంత్రి రాజీనామాకు పట్టుబట్టి..
ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి 22-ఏ అంశం రాజకీయంగా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఒక దశలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంటూ హరీశ్ రావు, కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వ బండారాన్ని బట్టబయలు చేస్తామని ప్రకటనలు చేశారు. తీరా అసెంబ్లీ సెషన్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా సస్పెన్షన్‌కు గురికావడంతో పోటీగా తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
రియల్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పుకున్నా.. మంత్రి పొంగులేటి చిట్టా విప్పడంతో బాధితుల సంగతేమోగానీ.. తమను తాము డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో ఎంతమంది లీడర్లు భూములు దండుకున్నారో, ఎవరెవరికి లబ్ధి చేకూర్చారో.. మంత్రి పొంగులేటి వెల్లడించడంతో.. అటు ఒప్పుకోలేక.. ఇటు ఖండించకపోవడంతో బీఆర్ఎస్ నేతల పాత్రపై ఇప్పుడు చర్చ మొదలైంది.
విచారణ చేపడితే ఇంకెందరి పేర్లు..
బీఆర్ఎస్ హయాంలో నిషేధిత భూముల జాబితా పేరుతో జరిగిన వ్యవహారాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. అది మొదలైతే ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయో, వాటికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందేమోననే అలజడి గులాబీ లీడర్లలో మొదలైంది. ప్రస్తుతానికి హరీశ్ రావు, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లు మాత్రమే బహిర్గతమైనా.. విచారణ సందర్భంగా ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది.
ఫీజు రీ ఎంబర్స్మెంట్ విషయంలో అవినీతికి పాల్పడినట్లు పరోక్షంగా మల్లారెడ్డి పేరును ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం ప్రస్తావించారు. భూముల లావాదేవీల విషయంలో పై ముగ్గురి పేర్లను మంత్రి పొంగులేటి ప్రస్తావించారు. ఒకవైపు ‘ప్రజా ప్రభుత్వం’లో ప్రజలు బాధితులుగా మారారంటూ చెప్పుకుంటున్న బీఆర్ఎస్.. గత ప్రభుత్వంలోని గోల్మాల్ను మంత్రి పొంగులేటి బహిర్గతం చేయడంతో తమ నిజాయితీని నిరూపించుకోవడం తక్షణ కర్తవ్యంగా మారింది.

