కలం, వెబ్ డెస్క్: టెలివిజన్ రంగ కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ‘తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డు’లు ప్రదానం చేయబోతున్నట్లు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా టెలివిజన్ రంగానికి అవార్డులు అందించబోతుండటం తెలంగాణ ఏర్పడ్డాక ఇదే మొదటిసారని మంత్రి పేర్కొన్నారు.
టీవీ ఛానెల్స్ యాంకర్లకు..
సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర టెలివిజన్ అవార్డులను రూపొందించాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) ఆదేశించారు. టీవీ రంగంలో పనిచేస్తున్న నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలాగే, టీవీ ఛానెల్స్‌లో పనిచేస్తున్న యాంకర్లు, ప్రజెంటర్లకు కూడా ఈ అవార్డులను ప్రదానం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలన్నారు.
పీవీ పేరిట మరొకటి..
మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరిట ‘తెలంగాణ రాష్ట్ర వారసత్వ పురస్కారం’ అందించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Read Also: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్!
Follow Us On: Sharechat

