కలం, కరీంనగర్ బ్యూరో: శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ రెండేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narendra Reddy) వెల్లడించారు. మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందని రాబోయే రోజుల్లో ఇంకా మరింత ముందుకు సాగుతుందని వెల్లడించారు. ఆదివారం ఆయన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కోట్ల రూపాయలతో అభివృద్ధి
ఇప్పటికే 183 పనులకుగాను కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, హైమాస్ లైట్లు, కూడళ్ల సుందరీకరణ తదితర పనులు చేపట్టామన్నారు. సుడాకు గతంలో గజం జాగా కూడా లేదని 800 గజాలలో 5 కోట్లతో కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాల క్రితం కట్టి వదిలేసిన ఐడీఎస్ఎంటి మురికి కూపమై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. దాన్ని కోటిన్నరతో అభివృద్ధి చేసి ఇప్పుడు త్వరలో అందుబాటులోకి తీసుకరాబోతున్నామని తెలిపారు.
రాజీవ్ చౌక్ ఆధునీకరించాం
టవర్ ఏరియాకు వచ్చే వారికి 100 కార్లు 300 బైకులు పార్కింగ్ చేసుకోవడానికి అందుబాటులోకి వస్తుందని 40 షెట్టర్లు ఆధునీకరించామని వాటిని అద్దెకిస్తామని ఐడీఎస్ఎంటి వెనుక కోటి ఇరవై లక్షలతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని త్వరలో శంకుస్థాపన చేస్తామని రాజీవ్ చౌక్‌ను సుందరీకరించి 9 ఫీట్ల రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో ముఖ్య అతిథులచే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని నరేందర్ రెడ్డి అన్నారు.
జూన్ 1 నుంచి సుడా ప్రగతి పక్షోత్సవాలు
జూన్ 1 నుండి జూన్ 15 వరకు సుడా ప్రగతి పై పక్షోత్సవాలు నిర్వహిస్తామని అందులో భాగంగా ప్రతి రోజు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు ఉంటాయని ఏడున్నర కోట్ల నూతన పనులకు టెండర్లు పిలిచామని అవి కూడా త్వరలో శంఖుస్థాపన చేస్తామని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ పక్షోత్సవాలలో అందరినీ భాగస్వాములను చేస్తామని రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎండీ తాజ్, చాడగొండ బుచ్చిరెడ్డి, టేల భూమయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, గుడిపాటి రమణారెడ్డి, మిర్యాల శ్రీధర్ రెడ్డి, జువ్వాడి అమరేందర్ రావు, కుర్ర పోచయ్య, దండి రవీందర్, జీడి రమేష్, మాసుంఖాన్, బషీర్, ఖలీల్, హనీఫ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

