కలం, కరీంనగర్: దేశంలో రాహుల్ గాంధీ నిప్పు రాజేస్తేనే బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని, ఆయన రాజకీయంగా రంగంలోకి దిగడంతోనే దేశవ్యాప్తంగా 80 సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైందని సుడా మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి( Narender Reddy) అన్నారు. రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు.
శనివారం కరీంనగర్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి అంగడికి వచ్చినంత మంది మాత్రమే హాజరయ్యారని, వేలాది మంది పాల్గొన్నట్లు ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. బస్సులు ఏర్పాటు చేసి దూర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పోరాటం వల్లే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. ఓటర్ల జాబితా నుంచి అసలైన ఓటర్లను తొలగించే కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని మండిపడ్డారు.
మూడు నాలుగు పార్టీలు మారిన బీజేపీ నేత సునీల్ రావు కాంగ్రెస్‌ను విమర్శించడం విడ్డూరమన్నారు. గతంలో బండి సంజయ్‌ను వందలసార్లు విమర్శించిన ఆయన ఇప్పుడు అదే నాయకుడిని పొగడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎస్ఆర్ నిధులతో సైకిళ్లు, చాక్లెట్లు పంపిణీ చేస్తూ గొప్పలు చెప్పుకోవడం తప్ప కరీంనగర్‌కు బీజేపీ చేసిందేమీ లేదన్నారు.
ప్రధాని మోదీ బండి సంజయ్ భుజం తట్టడం వల్ల నగరానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించారా, ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేశారా, డంపింగ్ యార్డు హామీని నెరవేర్చారా అని నిలదీశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు కాకుండా వచ్చే రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎండీ తాజ్, కార్పోరేటర్ పర్వతం మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

