కలం, కోదాడ : కోదాడలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు (Kodad Mega Job Mela) యువత నుంచి భారీ స్పందన లభించింది. ఉదయం నుంచే సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగార్థులు తరలివచ్చారు. ముందుగా 22 వేల మందికి పైగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా, మేళా ప్రాంగణంలో మరో 10 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో మొత్తం రిజిస్ట్రేషన్లు 32 వేలు దాటాయి. వివిధ రంగాలకు చెందిన సుమారు 350 కంపెనీలు మేళాలో పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.
సమాచార సాంకేతికత, ఫార్మా, తయారీ, విమానయానం, మౌలిక సదుపాయాలు, వైద్యం, బ్యాంకింగ్, రిటైల్ తదితర రంగాల్లో కంపెనీలు ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్, సాంకేతిక పరీక్షలు నిర్వహించాయి. మొత్తం 5,620 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయగా, 3,500 మందికి పైగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మేళా ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 700 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. పలువురు అభ్యర్థులకు కంపెనీల ప్రతినిధులు అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేశారు. ఫాక్స్‌కాన్, ఎల్‌అండ్‌టీ, ఎంఐఏఎల్, మహీంద్రా, టాటా, అరవింద్, ఎంఎస్‌ఎన్, మెట్రో, గూగుల్, ఇండిగో, అపోలో, మెడ్‌ప్లస్ తదితర ప్రముఖ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. ఎల్‌అండ్‌టీ సంస్థ 40 మంది యువకులను ఎంపిక చేసి సగటున నెలకు రూ.21 వేల వేతనం అందించనున్నట్లు తెలిపింది.
తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి ఈ జాబ్ మేళాను సందర్శించారు. కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు, ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడి ఉద్యోగాలు సాధించిన యువతకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మెగా జాబ్ మేళాకు లభించిన స్పందన తెలంగాణ గ్రామీణ యువత ఆకాంక్షలకు, వారి ప్రతిభకు నిదర్శనమన్నారు. అర్హత కలిగిన ఉద్యోగార్థులకు ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగాలను యువత ఇంటి ముంగిటకు తీసుకురావాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మేళా ప్రాంగణంలో అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణమైన కంపెనీల స్టాళ్లను సందర్శించి పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఒకే అభ్యర్థి పలు కంపెనీల్లో అవకాశాలను పరిశీలించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎంపిక, షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ రోజంతా కొనసాగగా, కంపెనీల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఉద్యోగాలు పొందే అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

