రేషన్ కార్డులపై ఫొటోల రగడ.. ‘రేపు కరెన్సీ నోట్లపైనా వేస్తారా?’

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన తీవ్ర వివాదాస్పదమవుతోంది. లబ్ధిదారులకు అందజేస్తున్న ఈ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను ముద్రించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలం పాటు వినియోగంలో ఉండే రేషన్ కార్డులను రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఏంటని ప్రతిపక్ష బీజేపీతో పాటు వివిధ వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

​ఈ క్రమంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ లబ్ధిదారు మహిళ (Khammam Viral Woman) వ్యక్తం చేసిన తీవ్ర ఆగ్రహం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేషన్ కార్డులపై మంత్రుల బొమ్మలు ముద్రించడంపై మండిపడిన సదరు మహిళ, అసలు కార్డుల మీద రాజకీయ నేతల ఫొటోలు వేయడం ఎక్కడైనా ఉందా అని నిలదీసింది. రేపు రాహుల్ గాంధీ కనుక ప్రధాని అయితే, ఆయన ఫొటోలను కరెన్సీ నోట్ల మీద వేస్తారా అంటూ ఎద్దేవా చేసింది. కార్డుపై ఒక్కరిద్దరివే ఎందుకు, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు వేసుకోవాల్సింది అంటూ “ఏందీ ఈ గలీజ్‌ యవ్వారం” అని ఘాటుగా విమర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

​రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా లబ్ధిదారులకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతుండగా, ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ధ్వజమెత్తుతున్నాయి. ప్రభుత్వం మారిన ప్రతిసారీ లేదా నేతలు మారినప్పుడు ప్రజాధనంతో కొత్త కార్డులు ముద్రించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని విమర్శలు వస్తున్నాయి. లబ్ధిదారుల నుంచి కూడా ఇలాంటి నిరసన గళాలు వ్యక్తమవుతుండటంతో స్మార్ట్ రేషన్ కార్డుల ఫొటోల వివాదం మరింత ముదిరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>