కలం, ఖమ్మం బ్యూరో : మహిళల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెడుతున్న నిర్వాహకుడిపై ఖమ్మం (Khammam) పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిందితుడి ఆగడాలకు చెక్ పెడుతూ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన బత్తుల బాలకృష్ణ (30) అనే వ్యక్తి అక్రమ సంపాదన ధ్యేయంగా వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నాడు.
పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను లొంగదీసుకుని ఈ అసాంఘిక కార్యకలాపాల్లోకి దించుతున్నాడు. ఇతనిపై ఖమ్మం టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో అనైతిక రవాణా, వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కాకినాడకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఖమ్మం రప్పించారు.
లాడ్జిలో గది అద్దెకు తీసుకుని, విటుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కుట్రలో బాలకృష్ణతో పాటు మెరెడ్డి సత్యవతి, లాడ్జి మేనేజర్ అలకుంట్ల శ్రీకాంత్ ఉన్నట్లు దర్యాప్తులో ఆధారాలు లభ్యమయ్యాయి.సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నిందితుడి నేర ప్రవర్తనను అరికట్టేందుకు 1986 (పీడీ యాక్ట్) సెక్షన్ 3(2) కింద చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

