కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) అన్నారు. మంగళవారం మానకొండూర్ (Manakondur) మండల కేంద్రంలో నిర్మిస్తున్న 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పేషెంట్ గదులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 50 పడకల ఆస్పత్రికి నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జూన్ నాటికి ఆస్పత్రిని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
మానకొండూర్ మండలంలో విద్యా విస్తరణకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తిమ్మాపూర్ మండలం యాదవులపల్లికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గన్నేరువరం మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్, బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల మంజూరయ్యాయని చెప్పారు. మానకొండూర్‌లో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే దాన్ని సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ విశ్వప్రసాద్, ఏఈ అర్బజ్, తహసీల్దార్ విజయ్ కుమార్, మండల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సల్మాన్, కాంట్రాక్టర్ మేడి రమేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, ప్యాక్స్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

