గణేష్ నవరాత్రులకు పటిష్ట బందోబస్తు: సీపీ అంబర్ కిషోర్ ఝా

కలం, రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ (Ramagundam CP) అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీసీపీలు, అడిషనల్ డీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించిన కమిషనర్.. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రమైన నేరాలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, ఆస్తి నేరాలు, గంజాయి, రోడ్డు ప్రమాదాలు, అదృశ్యమైన వ్యక్తుల కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. యూఐ కేసులపై డీసీపీలు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారానికోసారి సమీక్షించాలని సూచించారు. ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాల నియంత్రణకు సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

మహిళలు, బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సూచించారు. లైంగిక నేరాల కేసులను నిర్దేశిత కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని, షీ టీమ్స్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. వినాయక మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అవసరమైతే కేసులు నమోదు చేయాలని సూచించారు. కోర్టు కేసుల పరిష్కారంపైనా అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని, నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసి నేర నిర్ధారణ శాతాన్ని పెంచాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ సరఫరా, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక ఆదేశాలు

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జన శోభాయాత్ర ముగిసే వరకు నిర్వాహకులు, కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. వినాయక మండపాల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి మండప నిర్వాహకుడి వివరాలను పూర్తిగా సేకరించాలని, మండపాల వద్ద తప్పనిసరిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు, కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టినా, వాటిని ఇతరులకు పంపించినా చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ విభాగం పనితీరును కమిషనర్ అభినందించారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన ప్రతి సందర్భంలో తప్పనిసరిగా కేసు నమోదు చేయాలని, డీజీపీ, సీసీసీతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, ఏసీపీలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ అధికారులు, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>