కలం, ఖమ్మం బ్యూరో: నాడు కవల సోదరి.. నేడు వైదిక.. ఒకే రకమైన దుర్మార్గమైన వ్యాధి ఆ దంపతుల ఇంట మళ్లీ చీకట్లు నింపింది. విధి ఆడిన వింత నాటకంలో కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇద్దరు కుమార్తెలనూ ఒకే వ్యాధి పొట్టనబెట్టుకోవడంతో ఆ కన్నవారి గుండెలు పగిలిపోతున్నాయి. ఖమ్మం (Khammam) రూరల్ మండల పరిధిలోని ఎదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డులో చోటుచేసుకున్న ఈ దారుణ విషాదం స్థానికులందరినీ తీవ్రంగా కలిచివేసింది.
స్థానిక నివాసితులైన రంగిశెట్టి ఉదయ్, స్రవంతి దంపతులకు 14 ఏళ్ల క్రితం కవల పిల్లలు జన్మించారు. అయితే పుట్టిన కొద్ది రోజులకే వారిలో ఒక పాప పేగు సంబంధిత వ్యాధితో కన్నుమూసింది. ఆ తీవ్ర శోకం నుంచి కోలుకుని, మిగిలిన రెండో కుమార్తె వైదిక (14)నే ప్రాణంగా చూసుకుంటూ పెంచుకుంటున్నారు. కానీ, విధికి కరుణ లేకుండా పోయింది. వైదిక కూడా గత కొంతకాలంగా అదే పేగు వ్యాధితో బాధపడుతూ మృతి చెందింది. 14 ఏళ్ల వ్యవధిలో ఇద్దరు కుమార్తెలు ఒకే వ్యాధితో తమ కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఉదయ్, స్రవంతి దంపతులు విలపిస్తున్న తీరు అక్కడున్న వారిచేత కన్నీళ్లు పెట్టించింది.
వైదిక మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు, గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. వైదిక అంతిమ యాత్రలో తోటి విద్యార్థుల రోదనలు మిన్నంటాయి. తమతో పాటు తరగతి గదిలో నవ్వుతూ ఆడుకున్న స్నేహితురాలు ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేక విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డులో అంతిమ యాత్ర అత్యంత శోకసంద్రంలో సాగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.

