కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో నిందితుడు జైలు పాలయ్యాడు. కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.41,500 జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శివ రంజని మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు.
ఖమ్మం చెరువు బజార్ ప్రాంతానికి చెందిన మరుపల్లి రాంబాబు (35)పై 2024లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. నాటి దర్యాప్తు అధికారులు ఎస్సై K. వెంకటేష్, ఎస్సై యయాతిరాజ్ పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాపని స్వప్న ప్రాసిక్యూషన్ తరఫున బలమైన వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తి, రాంబాబుపై నేరం రుజువుకావడంతో అతడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేశారు.
కాగా, నిందితుడికి తగిన శిక్ష పడేలా సమర్థవంతంగా వ్యవహరించిన బ్రీఫింగ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, దర్యాప్తు అధికారులు, కోర్టు లైజన్ సిబ్బంది, ప్రాసిక్యూషన్ బృందాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్థులకు శిక్ష పడేలా కోర్టు విధుల్లో ప్రతిభ చూపిన సిబ్బందిని ఆయన కొనియాడారు.

