కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద భూమి (Khammam Railway Land) అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
20 ఏళ్లుగా ఇరుకుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ పక్కన భద్రాచలం వెళ్లే రహదారి విస్తరణకు దక్షిణ మధ్య రైల్వే 5,500 చదరపు గజాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని ఎంపీ వెల్లడించారు. దీనికి ప్రతిగా, ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ సదుపాయం కోసం 4,400 చదరపు గజాల ప్రభుత్వ భూమిని రైల్వే శాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఈ ప్రక్రియ పూర్తయిందని పేర్కొంటూ, స్థానిక దుకాణాలకు నష్టం కలగకుండా భూ బదలాయింపు పూర్తి చేసిన ఇరు జిల్లాల కలెక్టర్లకు, రైల్వే అధికారులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

