కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు యూనివర్సిటీలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఐక్య విద్యార్థి సంఘాల (Student Unions) ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో గత కొంతకాలంగా అనేక సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు.
ముఖ్యంగా మహిళా విద్యార్థుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీలో వెంటనే గైనకాలజిస్ట్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హెల్త్ సెంటర్లో సరైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా యూనివర్సిటీలో క్రికెట్ ఆడేందుకు ప్రత్యేక ప్లేగ్రౌండ్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాశాల వెనుక భాగంలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, క్రీడలు, ఇతర మౌలిక సదుపాయాలపై యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మారుతి, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు సుధాకర్, పీడీఎస్‌యూ నాయకుడు నరసింహ, ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకుడు ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, భీముడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

