కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh 2026) పూజా కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్న గణనాథుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుమారు 69 అడుగుల ఎత్తుతో, ఐదు ముఖాలు, ఐదు పడగలతో మహాగణపతిని ప్రతిష్ఠించారు.
మహాగణపతికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం ప్రతిరూపం, మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో ఖైరతాబాద్ గణేశుడి మండపం ఆధ్యాత్మిక వైభవంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు..
ఖైరతాబాద్ మహాగణపతికి సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి తొలి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Governor Shivpratap Shukla) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొలి పూజ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహాగణపతిని దర్శించుకోనున్నట్లు సమాచారం.
ఇక, సోమవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పండుగ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శనం, భద్రత, ఇతర సౌకర్యాలపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి ఏడాది భిన్నమైన రూపంలో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకునే ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో కొలువుదీరడంతో భక్తుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

