సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం

కలం కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని (TGSRTC) ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి తెలపడం, 10% ఫిట్‌మెంట్‌కు అంగీకరించడం, పలు డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించడం పట్ల కరీంనగర్ యూత్ కాంగ్రెస్ (Youth Congress) నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పరి విశాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పరి విశాల్, మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ.. దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కలను ప్రజా ప్రభుత్వం నిజం చేసిందని అన్నారు. గత పాలకులు 10 ఏళ్లు మోసం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. ఇది కార్మికుల విజయంగా వారు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల కన్నీళ్లు తుడిచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించి, జీతాలు పెంచి, యూనియన్ హక్కులు కల్పించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయించారని అన్నారు. యువత ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు అని మళ్లీ నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ (Youth Congress) జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం లావణ్య నాగప్రసాద్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జెరిపోతుల వాసు, నగర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుమన్, నాయకులు తరుణ్, ప్రసన్న, క్యాదాసు రాజు, సుఫియాన్, మహమ్మద్ ఆమేర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>