కలం, కరీంనగర్: లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, ఆర్థిక భద్రతపై అసత్య ప్రచారాలు చేస్తూ అపోహలు సృష్టిస్తున్నారని.. కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు తీవ్రంగా ఖండించారు. ఐఏఎస్ అధికారిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను విస్మరించి మాట్లాడటం బాధాకరమని అన్నారు.
ప్రజాపాలనకు వెన్నెముక ఉద్యోగులే
దేశ జనాభాలో ఉద్యోగుల వాటా రెండు శాతమే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నది ఉద్యోగులేనని స్పష్టం చేశారు.
పెన్షన్ భిక్ష కాదు… ఉద్యోగి హక్కు
పెన్షన్ వల్ల ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందనడం సరికాదన్నారు. జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగి వృద్ధాప్యంలో గౌరవప్రదంగా జీవించేందుకు పొందే సామాజిక భద్రతే పెన్షన్ అని, అది ఎవరో వేసే భిక్ష కాదని తేల్చిచెప్పారు.
ప్రజాప్రతినిధుల పెన్షన్లపై మౌనమేల?
ప్రజాప్రతినిధుల పెన్షన్లు, ఇతర ఖర్చులపై ప్రశ్నించని వారు, ఉద్యోగుల పెన్షన్లపైనే ఆర్థిక భారమంటూ మాట్లాడటం ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణలో పెండింగ్ డీఏలు, పీఆర్సీ వంటి సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను ప్రోత్సహించాల్సింది పోయి, ప్రజలకు, ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే యత్నాలను సహించేది లేదని హెచ్చరించారు.

