కరీంనగర్‌లో కాల్పుల దోపిడీపై గంగుల ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన పట్టపగలే కాల్పులు, దోపిడీ ఘటనపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర నడిబొడ్డున, ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోవడం రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఘటనపై స్పందించిన గంగుల కమలాకర్, “కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తోంది..? నగర భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థలు ఎందుకు పనిచేయడం లేదు..? పోలీసులు ఎక్కడున్నారు..?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసిందా అని నిలదీశారు.

దుండగులు మాస్క్ కూడా లేకుండా వచ్చి, నేరుగా షాపులోకి దూసుకెళ్లి చోరీకి పాల్పడటం చూస్తే ఇది పోలీసులకు, ప్రభుత్వానికి నేరస్తుల ఓపెన్ ఛాలెంజ్ లాంటిదని గంగుల వ్యాఖ్యానించారు. “ముఖాలు కప్పుకోకుండా వచ్చి చోరీ చేస్తే.. వాళ్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..? రాష్ట్రంలో నేరస్తులకు భయం లేకుండా పోయిందా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. గతంలో ఎన్నేళ్లుగా కరీంనగర్‌లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని, శాంతియుత నగరంగా పేరున్న కరీంనగర్‌లో ఇప్పుడు కాల్పులు, దోపిడీలు జరగడం ప్రజలను కలవరపెడుతోందన్నారు. నగరంలో వ్యాపారులు, సామాన్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో కరీంనగర్ నగర భద్రత కోసం 711 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఆ కెమెరాల వల్ల గతంలో అనేక నేరాలు వెలుగులోకి వచ్చాయని, నిందితులను సులభంగా పట్టుకునేవారని తెలిపారు. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు పనిచేయడం లేదా..? లేక పర్యవేక్షణే లేదా..? అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం, భద్రతా వ్యవస్థల వైఫల్యం వల్లే నేరస్తులు ఇంత తెగబడ్డారని గంగుల ఆరోపించారు. ప్రజల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను 24 గంటల్లోపు పట్టుకుని ప్రజల్లో నమ్మకం కల్పించాలని, లేకుంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గాయపడిన బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>