కలం, నిజామాబాద్ బ్యూరో : ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగానికి సంబంధించినవేనని, ఉపాధ్యాయులు సంతృప్తిగా పనిచేయాలంటే సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ముఖ్యమంత్రి చెప్పినట్లు విద్యారంగ సమస్యలపై ఐక్యంగా కొట్లాడాలని టీఎస్ యుటిఎఫ్ (TSUTF) రాష్ట్ర కమిటీ తీర్మానించింది. ఆదివారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. హేతుబద్ధీకరణ జీవో 25 ను హేతుబద్ధంగా సవరించాలని డిమాండ్ చేశారు. ఈ జీవో విద్యారంగానికి మరణ శాసనం లాంటిదని అన్నారు. సర్వీసు నిబంధనల సంక్షోభం పరిష్కారానికి చొరవ చూపాలని, డిఈఓ, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని, వాటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని, ఆగస్టు 15 లోగా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ అమలు గడువు ముగిసి మూడేళ్ళు అవుతున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. ఆరు వాయిదాల కరువుభత్యం విడుదల చేయాలని, పెండింగ్ బిల్లుల విడుదలలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని అన్ని హాస్పిటల్స్ లో సమర్థవంతంగా అమలు చేయటానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గ భవాని, ఎం. రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి టీ లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వి . శాంతి కుమారి, డి. సత్యానంద్, ఎస్.మల్లారెడ్డి, బి. రాజు, కె. రంజిత్ కుమార్, ఎస్. రవి ప్రసాద్ గౌడ్, కె. రవి కుమార్, జి. శ్రీధర్, ఎ. సింహాచలం, వై. జ్ఞాన మంజరి, ఎం. వెంకటప్ప, పి వెంకటేశ్వర్లు, జే . యాకయ్య, సీనియర్ నాయకులు పి.మాణిక్ రెడ్డి, ఎన్. కిష్టయ్య, ఎస్ వై కొండల్ రావు, మస్తాన్ రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆకుల బాబు, సాయిలు 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

