కలం, కరీంనగర్: ప్రస్తుత ఆధునిక సమాజంలో వివిధ వృత్తులలో పని చేస్తున్న వ్యక్తులు మానసిక సంఘర్షణల మధ్య జీవితాలు గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం కరీంనగర్ (Karimnagar) సేవాకేంద్రం నిర్వాహకులు బీకే విజయలక్ష్మి, బీకే మనీషా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్ అన్నారు. ప్రతి వ్యక్తి మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడే ఆయా రంగాలలో వారు రాణించేందుకు వీలు కలుగుతుందన్నారు. స్థానిక కిసాన్ నగర్ లోని మైత్రి కన్వెన్షన్ లో ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌజన్యంతో సమతుల్యమైన వ్యాపారం – సంతృప్తికరమైన జీవితం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక బ్రహ్మకుమారీస్ కేంద్రంలో సంబంధిత వివరాలను విలేకరులకు వెల్లడించారు.
బ్రహ్మకుమారీస్ (Brahma Kumaris) ఆధ్వర్యంలోని రాజయోగ ఫౌండేషన్ ద్వారా వివిధ వృత్తులలో ఉన్న వారికి మానసిక ఒత్తిళ్లను తగ్గించుకొనే కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగానే కరీంనగర్ పట్టణంలోని వ్యాపార, వాణిజ్య వర్గాల వారి కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరుగుతుందన్నారు. “వ్యాపారం లో విజయం, సంతృప్తికరమైన జీవితం” రెండు కలిసి ఎదగ గలవా? అనే అంశంపై బిజినెస్ వింగ్ నేషనల్ కోఆర్డినేటర్ బ్రహ్మకుమారీ దీప వ్యాపార వాణిజ్య వర్గాలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, మేయర్ కోలగాని శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని మార్గ దర్శనం చేయనున్నారని తెలిపారు.

