కలం, మెదక్ బ్యూరో: రైతులకు వ్యవసాయాన్ని మరింత సులువుగా, లాభదాయకంగా మార్చేందుకు వినూత్న ఆవిష్కరణలు, ఇంజనీరింగ్ పరిశోధనలే లక్ష్యంగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది (Kandi) లో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల (Agricultural Engineering College) ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక కళాశాల ఇదే కావడం విశేషం. 250 విద్యార్థులు పలు కోర్సులు చదువుతున్నారు. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టిన టీచింగ్ అసోసియేట్ అనగా అసిస్టెంట్ ప్రోపెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిబంధనలను పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ అర్హత ఉన్నవారికి పోస్టింగ్
ముఖ్యంగా ‘ఫామ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్’ విభాగంలో చేపట్టిన నియామకలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టు కోసం పలువురు అభ్యర్థులు పోటీ పడగా, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET), పీహెచ్డీ (PhD) పూర్తి చేసిన వారితో పాటు ప్రతిష్టాత్మక ఐఏఆర్ఐ (IARI – ఢిల్లీ)లో చదివిన అత్యున్నత అర్హతలు కలిగిన అభ్యర్థులు అప్లై చేశారు. ఉన్నత విద్య అర్హతలు ఉన్నవారిని పక్కన పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం మాస్టర్స్ డిగ్రీ (M.Tech) మాత్రమే ఉన్న అభ్యర్థలను టీచింగ్ అసోసియేట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల గా అవకాశం కల్పించడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మిగతా అభ్యర్థులు వాపోతున్నారు.
ఏం జరిగింది
యూనివర్సిటీ ఇంటర్వ్యూ ప్యానెల్ నిర్ణయాన్ని కాదని, కాలేజీ ప్రిన్సిపాల్, సంబంధిత విభాగాధిపతి (HOD) ఇద్దరే ఏకపక్షంగా ఫ్యాకల్టీగా ఎంపిక చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కళాశాలలోని ‘ఫుడ్ ప్రాసెసింగ్’, ‘సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్’ విభాగాల్లో నియామకాలు అర్హతల ప్రకారం, పారదర్శకంగానే జరిగినప్పటికీ.. ఒక్క ‘ఫామ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్’ విభాగంలోనే నిబంధనలు ఉల్లంఘించారని సమాచారం.
ఉన్నత చదువులు చదివి, జాతీయ స్థాయి సంస్థల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొండిచేయి చూపి, తక్కువ అర్హత ఉన్నవారికి పోస్టింగ్ ఇవ్వడంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసిన వారిని.. ఏ ప్రాతిపదికన ఎంపిక చేసారో చెప్పాలని ప్రిన్సిపాల్ కు కాల్ చేసినా, ఈ మెయిల్స్ చేసినా స్పందించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. తమ కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
వ్యవసాయ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యాబోధనలో అర్హత, సరైన అనుభవం లేని వ్యక్తులు బోధకులుగా ఉంటే, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. NET, PhD లేదా IARI వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన వారికి సబ్జెక్టుపై లోతైన పట్టు, ఆధునిక పరిశోధనలపై అవగాహన ఉంటుంది. తక్కువ అర్హత ఉన్నవారు కేవలం పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలకే పరిమితమై, సంక్లిష్టమైన ఇంజనీరింగ్ అంశాలను సరిగ్గా వివరించలేరు.
ఫామ్ మెషినరీ, పవర్ ఇంజనీరింగ్ వంటి విభాగాలు పూర్తిగా ప్రాక్టికల్ ప్రాధాన్యత కలిగినవి. సరైన నైపుణ్యం లేని టీచర్లు ఫీల్డ్ వర్క్, మెషినరీ పనితీరుపై విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ ఇవ్వడంలో విఫలమవుతారు. వ్యవసాయంలో వినూత్న యంత్రాల ఆవిష్కరణకు పరిశోధనలు కీలకం. అర్హత లేని అధ్యాపకులు విద్యార్థులకు ప్రాజెక్టు గైడ్లుగా వ్యవహరించినప్పుడు, వారి నుంచి కొత్త ఆలోచనలకు లేదా పేటెంట్లకు తగిన ప్రోత్సాహం లభించదని కాలేజ్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : కొండా సురేఖకు మీనాక్షి ఫోన్.. కీలక సూచన!
Follow Us On: X(Twitter)

