కలం, వెబ్ డెస్క్ : రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్ (Manasa Hills Mining) వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రస్థాయిలో స్పందించింది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా తవ్వకాలు జరుపుతోందన్న ఆరోపణలపై ఎన్హెచ్ఆర్సీ కొరడా ఝళిపించింది.
మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణించిన కమిషన్, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మానస హిల్స్‌లో పర్యావరణ పరిరక్షణ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన అక్రమ మైనింగ్‌పై రెండు నెలల్లోగా (8 వారాల్లో) తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో చేపట్టిన చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారుడైన రామారావు ఇమ్మనేనికి క్రమం తప్పకుండా తెలియజేయాలని ఆదేశించింది.
ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పందించిన కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, మానస హిల్స్ అక్రమ తవ్వకాలపై వెంటనే తగిన చర్యలు చేపట్టి నివేదిక అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. ఈ విషయంపై ఫిర్యాదుదారు రామారావుకు కేంద్ర గనుల శాఖ అధికారికంగా సమాచారం అందించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యంతో ఇప్పుడు అధికారులు కదులుతుండటంతో అక్రమ మైనింగ్ (Manasa Hills Mining) వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Also Read : కొండా సురేఖకు మీనాక్షి ఫోన్.. కీలక సూచన!
Follow Us On : WhatsApp

