యూట్యూబర్ నందనకు మరోసారి నోటీసులు

కలం, వెబ్ డెస్క్: లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు నమోదైన కేసులో ప్రముఖ యూట్యూబర్‌ నందనకు (YouTuber Nandana) ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. యూట్యూబ్‌ ఛానల్‌ ‘నందూస్‌ వరల్డ్‌’ ద్వారా రమానందన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

రూ.10.50 లక్షలు వసూలు చేశారనే ఆరోపణ

అద్దంకి మండలం పేరాయపాలెంకు (Perayapalem) చెందిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. తన కోడలికి లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రమానందన తమ కుటుంబం నుంచి విడతల వారీగా రూ.10.50 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో పలువురికి ఉద్యోగాలు ఇప్పించినట్లు చెప్పడంతో ఆమెను నమ్మి డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో పాటు చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో అరెస్టు

ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు జులై 4న నందనతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఓ షో ఎంపికల కోసం హైదరాబాద్‌ వచ్చిన రమానందన శుక్రవారం న్యాయవాదితో కలిసి అద్దంకి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నోటీసులు స్వీకరించారు. విచారణకు హాజరై కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని పోలీసులు సూచించారు.

గతంలోనూ కేసులు.. దర్యాప్తు కొనసాగింపు

యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై గతంలో ఎన్టీఆర్‌ జిల్లా(NTR District) లోనూ రమానందనపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసులకు సంబంధించి లుకౌట్‌ నోటీసులు జారీ కావడంతో హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, తన భర్తే ఇలాంటి విషయాలు చూసుకుంటారని ఆమె విచారణలో తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం అద్దంకి పోలీసులు కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>