కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నేడు తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో తమిళనాడు రాష్ట్ర ప్రగతి, ప్రజల బాగు కోసం తనకు ఉన్న అనేక ఆశయాలు, కలలను సీఎం విజయ్ ఎంతో ఉత్సాహంగా పంచుకున్నారని కమల్ హాసన్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విజయ్ తనతో ప్రవర్తించిన తీరు, తనపై చూపించిన ఆప్యాయత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన తనకు ఎంతో గర్వకారణంగా అనిపించిందని చెప్పారు.
అలాగే ఈ భేటీలో తమిళ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమల్ హాసన్ సీఎం విజయ్ దృష్టికి తీసుకెల్లారు. ప్రస్తుతం కోలీవుడ్ అనేక అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటోందని, సినీ పరిశ్రమ మళ్లీ నిలదొక్కుకోవాలంటే తమిళనాడు ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం 6 ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎం విజయ్‌కి సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అంతా మంచే జరగాలని కమల్ ఆకాంక్షించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

