కలం, కరీంనగర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సీపీఐ (CPI) చూస్తూ ఊరుకోదని, వక్రీకరించాలనుకునే వారిపై పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ హెచ్చరించారు. హైదరాబాద్ సంస్థానంలోని నిజాం రజాకార్ పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కీర్తించిందని.. ఆనాటి పాలకుల విస్మరణను పదేపదే విమర్శించిన నేటి కాంగ్రెస్ పాలకులు సైతం సాయుధ పోరాటాన్ని విస్మరించడం దుర్మార్గమని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం కరీంనగర్ కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల సాయుధ పోరాటానికి సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం..
వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలవేన శంకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ నిజాం నవాబుల పరిపాలనలో కొనసాగుతున్న హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం సిద్ధించలేదన్నారు. ఈ సంస్థానంలో ప్రజలను పట్టిపీడిస్తూ వెట్టి చాకిరి చేపిస్తూ, ప్రజల నుండి పన్నులు వసూలు వసూలు చేశారని గుర్తు చేశారు. బానిసలుగా చూస్తున్న క్రమంలో బానిసత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, పని ముట్లనే ఆయుధాలుగా మార్చుకొని తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందన్నారు. సీపీఐ, ఆంధ్రమహాసభ నాయకుల వల్ల సాయుధ పోరాటంలో ఉద్యమించిన వారి వల్ల హైదారాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిందని శంకర్ గుర్తుచేశారు.
బద్దం ఎల్లారెడ్డి జన్మించిన గడ్డ ఇది..
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టానికి పిలుపునిచ్చిన అగ్రనేత బద్దం ఎల్లారెడ్డి జన్మించిన గడ్డ కరీంనగర్ జిల్లా అని కొనియాడారు. పోరాటాలకు వెనకాడని నేల ఇది అని పేర్కొన్నారు. ఇలాంటి నేలపై సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమం ఒక ప్రాంతీయ ఉద్యమం కాదని.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలను పట్టిపీడిస్తున్న నిజాం రజాకార్ల నుండి వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన ఉద్యమమని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనను తరిమికొట్టడానికి సాగిన ఆ మహత్తర పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగం ఉందన్నారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవడానికి వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, చాడ శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, భావండ్లపెల్లి యుగేందర్, మచ్చ రమేష్, నలువాల సదానందం, నాయకులు సాయవేణి రాయమల్లు, బాకం ఆంజనేయులు, కసిబోజుల సంతోష్ చారి, చెంచల మురళి, కాల్వ శ్రీనివాస్ యాదవ్, నునావత్ శ్రీనివాస్, మామిడిపల్లి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

