జూరాలలో ఇక తాగునీటికే నీటి నిల్వ.. సాగునీటి విడుదల బంద్‌!

కలం, జోగుళాంబ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుల్లో (Jurala Project) నీటి నిల్వల సామర్థ్యం బాగా తగ్గిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,038.353 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం స్థూల నిల్వ 5.928 టీఎంసీలు, వినియోగించుకోదగిన లైవ్‌ నిల్వ 2.221 టీఎంసీలుగా ఉంది. దీంతో మిగిలిన నీటిని పొదుపుగా వాడాలని అధికారులు నిర్ణయించారు. జూరాల ప్రాజెక్టు మీద ఆదార పడి‌ఉన్న రిజర్వాయర్, కుడి, ‌ఎడమ కాలువలు, ఎత్తిపోతల పథకం ద్వారా సాగుకు నీరును నిలిపివేశారు‌.

జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం బట్టి ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగీరథ కింద తాగునీటి అవసరాలకే నీటిని అందించాలని నిర్ణయించారు. జూరాల ప్రాజెక్టుల్లో ఉన్న 2.221 టీఎంసీల నీటిని వచ్చే ఏడాది మే నెల దాకా తాగునీటి అవసరాల కోసం వాడనున్నారు. మరో రెండు నెలలో త్రాగు నీటి అవసరాల కోసం ఉన్న నీటిని వాడుకుంటే… జూరాల డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంటుంది. దీంతో రానున్న కాలంలో త్రాగు నీటి అవసరాల కోసం కర్ణాటక నుంచి మరో 5-10 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేస్తేనే త్రాగునీటి గండం నుంచి గట్టెక్కే అవకాశముంది.

2 .221టిఎంసిలకు పడిపోయిన నిల్వలు

జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలు గత పదే్ళ్లుగా ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయి. ఈనెల 27 నాటికి జలాశయంలో 2.221 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఏడాది జూరాల పరివాహక ప్రాంతంలో ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లే‌‌దిగువకు విడుదల చేశారు.

సాగుకు నీటి విడుదల బంద్‌

జూరాలపై ఆధారపడిన కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల కింద సాగుకు నీటి విడుదల నిలిపివేశారు. జూరాల కుడి, ఎడమ కాలువల కింద 34,346 ఎకరాలు, నెట్టెంపాడు కింద 24,800 ఎకరాలు, భీమా కింద 29 వేల ఎకరాలు, కోయిల్‌సాగర్‌ కింద 8 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం జూరాలలో ఉన్న నీటి పరిస్థితుల నేపథ్యంలో యాసంగి పంటలకు నీరిచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జూరాల ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో వివిధ లిప్ట్‌ల కింద ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేయమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 2.221(లైవ్‌)టీఎంసీల నీరు ఉన్నది. ర్యాలంపాడ్‌ 4టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా, లీకేజీల కారణంగా ప్రస్తుతం 1టీఎంసీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితిలో ఉండడంతో ఈ ప్రభావం పంటలపై పడుతున్నది.

ఏడాదిలోనే మారిన పరిస్థితి

గత ఏడాది డిసెంబరులో రెండో పంటకు సరిపడా సాగు, తాగునీరు జూరాలలో అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది ఆగస్టులోనే నిల్వలు తగ్గుముఖం పట్టాయి. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లు, బావుల్లో నీరు తగ్గిపోయింది. చివరకు యాసంగి సాగుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది.

వేసవిపై ఆందోళన

జూరాల నీటిపై గద్వాల, వనపర్తి జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు ఆధారపడి ఉన్నాయి. మిగిలిన నీటిని మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటికి వినియోగించనున్నారు. తాగునీటి అవసరాల కోసం కర్ణాటక నుంచి కనీసం 5-10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎగువ నుంచి నీరు రాకపోతే వచ్చే వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పేలా లేవు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>