రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: సంయుక్త కిసాన్ మోర్చా

కలం, నల్లగొండ: సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం నల్గొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్‌కు గ్రామీణ రైతు కూలీ సంఘం పలు డిమాండ్ ల తో వినతిపత్రం అందజేసింది. ఐదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రైతులు పండించిన పంటలకు పెట్టుబడి ఖర్చుపై 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించి ఎంఎస్‌పీ గ్యారంటీ చట్టం చేయాలని విన్నవించారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని, మారటోరియం పేరుతో కాలయాపన చేయవద్దని రైతు కూలీ సంఘం నాయకులు కోరారు.

విద్యుత్ ప్రైవేటీకరణ ఆపి 2025 విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మవద్దని, విచక్షణారహితంగా కార్పొరేట్ కంపెనీలకు రైతుల భూములు ఇవ్వవద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. లఖింపూర్ ఖేరీ మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

ఉపాధి కూలీలకు 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని, కరువుతో నష్టపోయిన రైతులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలన్నారు. సాగునీరు లేక పడావుపడిన భూముల రైతులకు ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటి రైతు వ్యతిరేక ఒప్పందాలను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామీణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ జక్కుల నరసింహ, ధోని లింగారెడ్డి, పెదమారయ్య, కుందన, పెళ్లి సత్తయ్య, ఏరుకొండ కోటేష్, కోటయ్య, గోర్ల సత్తయ్య, విమలమ్మ, కృష్ణయ్య, బుర్ర బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>