కలం మెదక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనపై పీడీ యాక్ట్ మోపేందుకు 40 ఫిర్యాదులు సేకరించాలని హరీశ్ రావుతోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యే ప్లాన్ చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తనకు అప్పులు ఇచ్చిన 10 మందితో కేసులు పెట్టించేందుకు డబ్బులు కూడా ఆశా చూపారన్నారు. అప్పులు ఇచ్చినవారే ఈ విషయాన్ని తనకు చేరవేశారని జగ్గారెడ్డి వెల్లడించారు.
సంగారెడ్డి మల్కాపూర్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌ఏ నిర్వహించిన సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. హరీశ్ రావు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గలేదన్నారు. 2015లో సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో అప్పటి సీఎం కేసీఆర్, హరీష్ రావు తనపై పగ పెంచుకున్నారన్నారు. అప్పటి సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి, ముగ్గురు విజిలెన్స్ ఐపీఎస్‌లు, నలుగురు డీఎస్పీలతో తన ఆస్తులు, పటాన్‌చెరు భూములపై విచారణ జరిపించినా పోలీసులకు ఏమీ లభించలేదని నివేదిక ఇచ్చారన్నారు.
అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో సమావేశం జరిపినా, కేసులు పెట్టడం సాధ్యం కాదని పోలీసులు తేల్చిచెప్పడంతో చివరికి పాస్‌పోర్ట్ కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా తాను రివెంజ్ పాలిటిక్స్ చేయనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. “హరీష్ రావును నేను టార్గెట్ చేయడం లేదు, నిందించడం లేదు. ఆయన వ్యూహంలో ఆయన సరైన పనే చేశారు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

