కలం, వెబ్ డెస్క్: తెలంగాణకు కృష్ణా జలాల నీటి హక్కులపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ చేతకానితనంతో తెలంగాణకు రావాల్సిన నీళ్లు, ఏపీకి మళ్లుతున్నాయని అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. మన నీటి వాటాను ఏపీ యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఎందుకు సోయి లేదు?
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 7 ప్రాజెక్టుల మీద రివ్యూ చేయాలని చంద్రబాబు లెటర్ రాస్తే ఎజెండాలో పెట్టారని జగదీశ్ రెడ్డి అన్నారు. దీని మీద మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రులకు ఎందుకు సోయి లేదు? అని ప్రశ్నించారు. తాము ప్రశ్నిస్తే తమ మీదే ఎదురుదాడి చేశారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ద్రోహం చేస్తుంటే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మౌనంగా ఉన్నాడని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది..
తెలంగాణకు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చంద్రబాబు జీఆర్ఎంబీ (GRMB) మీటింగ్ అజెండాలో పెడితే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇస్తే ఈఎన్సీతో లేఖ రాయించారని అన్నారు.దీనిపై చంద్రబాబుకు డబ్బా కొట్టే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం సమాధానం ఇస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని జీఆర్ఎంబీ అజెండాలో పెడితే బీజేపీ ఎంపీలు ఆ సమావేశానికి ఎలా వెళ్తారు? అని నిలదీశారు. జీఆర్ఎంబీ ఎజెండాలో 7 ప్రాజెక్టుల మీద సమీక్ష చేసే అంశం తీసివేయాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ సైన్యం ఈ మీటింగ్‌కు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం సంగతి తెలుస్తుందని హెచ్చరించారు.

