డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి: కమిషనర్ గిరీష్

కలం, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ ఆక్రమణలు, మురుగునీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ గిరీష్(Commissioner Girish) తెలిపారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 15, 21వ వార్డుల్లో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువల్లో ఏర్పడిన అడ్డంకులను, మురుగునీరు నిల్వ ఉంటున్న ప్రాంతాలను తనిఖీ చేశారు.

డ్రైనేజీల్లో మురుగునీరు సక్రమంగా ప్రవహించక నిల్వ ఉండటం వల్ల దోమల వ్యాప్తితో పాటు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. కొంతమంది ఇళ్ల యజమానులు మున్సిపల్ డ్రైనేజీలపై మ్యాన్‌హోల్ సదుపాయం లేకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని తెలిపారు. దీంతో డ్రైనేజీల శుభ్రత చేపట్టేందుకు పారిశుద్ధ్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసి, అడ్డంకులను తొలగించాలని, అవసరమైన ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పరిరక్షణ దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో వర్తించే చట్ట నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసులు లేకుండానే అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

అలాగే తొలగింపు చర్యలకు అయ్యే ఖర్చును సంబంధిత బాధ్యుల నుంచే నిబంధనల ప్రకారం వసూలు చేస్తామని హెచ్చరించారు. డ్రైనేజీలపై నిర్మించిన అడ్డంకులను యజమానులు స్వచ్ఛందంగా తొలగించి మురుగునీటి సజావైన ప్రవాహానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>