కలం, నేషనల్ డెస్క్: మనిషి సృష్టించిన మేధస్సే చివరికి మనిషి మనుగడకే ముప్పుగా మారనుందా?, మానవ ఆలోచనలను మించి ఆలోచించే స్థాయికి ఏఐ (AI) ఎదిగితే రేపటి ప్రపంచం ఎలా ఉంటుంది?, అది మన మాట వింటుందా.. లేక మనల్నే ఎదురిస్తుందా? మనకంటే అత్యంత తెలివైన యంత్రాలు పుట్టుకొస్తే వాటిని నియంత్రించే శక్తి మన చేతుల్లో ఉండదా?.. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కంపెనీల మధ్య పెరుగుతున్న తీవ్రమైన పోటీపై ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్లో మూడేళ్లుగా ప్రిట్రైనింగ్ రీసెర్చర్గా పనిచేస్తున్న 27 ఏళ్ల జాకబ్ (Jacob Coxon).. కంపెనీల వైఖరిని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు సాంకేతికతను సురక్షితంగా మార్చడం కంటే, అత్యంత శక్తివంతమైన సూపర్ ఇంటెలిజెన్స్ (మానవాతీత మేధస్సు)ను ముందుగా సాధించాలనే రేసులోనే ఎక్కువగా పరుగెడుతున్నాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
ఆ పోటీ భయమే కారణం
ఏఐని అభివృద్ధి చేస్తున్న కంపెనీల సీనియర్ పరిశోధకులు, అధికారులు బయటకు అంతా సవ్యంగానే ఉందన్నట్లు మాట్లాడుతున్నప్పటికీ.. అంతర్గత సంభాషణల్లో మాత్రం ఈ దశాబ్దం చివరికల్లా ఏఐతో తలెత్తే తీవ్రమైన భద్రతా ముప్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాక్సన్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెంది.. ఏ వ్యవస్థనైనా ప్రభావితం చేయగల సూపర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇతర కంపెనీల కంటే తామే ముందుండాలనే పోటీ భయమే ఈ వేగవంతమైన రేసుకు కారణమని పేర్కొన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యాన్ని పెంచే క్రమంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. అవసరమైతే అభివృద్ధి వేగాన్ని తాత్కాలికంగా తగ్గించాలని సూచించారు.
ముప్పు 10 శాతానికిపైనే..!
కాక్సన్ వ్యాఖ్యలకు ఆంథ్రోపిక్ అలైన్మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్ హుబింగర్ మద్దతు పలకడం మరింత చర్చకు దారితీసింది. రాబోయే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతమయ్యే ప్రమాదం 10 శాతానికిపైగానే ఉందని తాను నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు సూపర్ ఇంటెలిజెన్స్‌ను మానవ నియంత్రణలో ఉంచేందుకు ప్రస్తుతం తమ వద్ద పూర్తిస్థాయి పరిష్కారం లేదని అంగీకరించారు.
ఏఐకి బ్రేక్ ఎక్కడ..?
ఏఐతో వైద్యం, విద్య, పరిశ్రమ, పరిశోధన.. ఇలా ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రపంచం ఆశిస్తున్నది. అయితే, ఏఐ అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ.. దాని వల్ల తలెత్తే ప్రమాదాలపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే స్థాయిలో భద్రతా ప్రమాణాలు, నియంత్రణ వ్యవస్థలు కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఏఐ రంగంలో పనిచేస్తున్న వారే దాని ప్రమాదాలపై బహిరంగంగా హెచ్చరిస్తుండటం.. సాంకేతిక పురోగతి కంటే మానవ భద్రతే ముందుండాలన్న విషయాన్ని గుర్తుచేస్తున్నది.
Also Read : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

