కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. దాడి చేయడమే కాకుండా, తమపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మగ ఎమ్మెల్యేల ముందు మహిళా పోలీసులను ముందు వరుసలో పెట్టి, వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. 22ఏ నిషేధిత భూములు, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ బకాయిలు, రైతులకు యూరియా వంటి అంశాలపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేదన్నారు.
‘అదొక.. ఫేక్ అకౌంట్’
బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చూపించిన అకౌంట్ ఫేక్ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఫేక్ అకౌంట్ పట్టుకుని మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ నకిలీ అకౌంట్ కాంగ్రెస్ పార్టీ వారిదే అని.. తమకు సంబంధం లేదన్నారు. ఫేక్ అకౌంట్ నడిపే వారిపై తక్షణమే విచారణ చేపట్టాలని, దీనిపై మధ్యాహ్నం సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతేగాకుండా, సీఎం రేవంత్ మీద సభా హక్కుల ఉల్లంఘన కూడా పెడుతామన్నారు.

