కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ (Gulf) ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక కేంద్రాలు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని భారీ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో (Iran Launches Missile) విరుచుకుపడింది. కువైట్‌లోని అలీ అల్ సలేమ్, క్యాంప్ అరిఫ్జన్ వైమానిక స్థావరాలతో పాటు, బహ్రెయిన్‌లోని ఇసా వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. పర్షియన్ గల్ఫ్, ఖేష్మ్ ద్వీపంలో ఇరాన్ ఆస్తులపై, అలాగే హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ చమురు ట్యాంకర్‌పై అమెరికా ఇటీవల జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు టెహ్రాన్ అధికారికంగా ప్రకటించింది. దుబాయ్ సమీపంలోని ఒక వాణిజ్య చమురు ట్యాంకర్‌ను కూడా ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
ఈ ముప్పును తిప్పికొట్టడానికి అమెరికా, బహ్రెయిన్ దళాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి వారు ఎమ్ఐఎమ్-104 పేట్రియాట్ వాయు రక్షణ వ్యవస్థల ద్వారా ఇంటర్‌సెప్టర్లను ప్రయోగించారు. ఈ ఘర్షణల నేపథ్యంలో కువైట్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినపడగా, బహ్రెయిన్, ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మార్మోగాయి. ఇకపై తాము సమాన స్థాయిలో స్పందించే వ్యూహాన్ని పక్కన పెట్టామని, అమెరికా చేసే ప్రతి తదుపరి చర్యకు ఒకటిన్నర రెట్లు శక్తివంతంగా సమాధానం ఇస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలిగిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.

