కలం, వెబ్ డెస్క్: మయన్మార్లో చోటు చేసుకున్న రోహింగ్యాల సామూహిక హత్యల (Rohingya Killings) విషయంలో ఆ దేశాన్ని దోషిగా ప్రకటిస్తూ ఇంటర్నేషన్ కోర్టు ఆఫ్ జస్టిస్ (International Court Of Justice) సంచలన తీర్పు వెలువరించింది. వేలాది మంది రోహింగ్యాలను మయన్మార్ సైన్యం అత్యంత పాశవికంగా హత్యలు చేసి మారణహోమం సృష్టించిందని పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. 2019లో ఆఫ్రికా దేశమైన గాంబియా రోహింగ్యాల హత్యలపై కోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ చేస్తూ వస్తోంది. గురువారం నాడు 15 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 9–6 మెజార్టీతో మయన్మార్ దేశాన్ని బాధ్యురాలిగా ప్రకటించింది. ఇలా ఒక దేశాన్ని దోషిగా ప్రకటించడం కోర్టు చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం.
10 వేల మందికిపైగా హత్య..
మయన్మార్ దేశంలో 2017 నుంచి రోహింగ్యా ముస్లింలపై అక్కడి సైన్యం భీకర దాడులు చేపట్టింది. ఎంతో మందిని ఊచకోత కోయడంతో పాటు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంది. మయన్మార్ దేశంలో జరుగుతున్న అరాచకాల గురించి ఆమ్నెస్టీ వంటి ఎన్నో ఎన్జీవో సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ వచ్చాయి. సుమారు 10 వేల మందిని సైన్యం బలితీసుకుందని అంచనా వేశారు. మయన్మార్ దేశంలో హింస కారణంగా రోహింగ్యా ముస్లింలు భారత్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు శరణార్థులుగా వచ్చారు. రోహింగ్యా ప్రజలను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతోనే మయన్మార్ సైన్యం మారణహోమానికి తెగబడిందని ఇంటర్నేషన్ కోర్టు (International Court Of Justice) తన తీర్పులో స్పష్టం చేసింది.
Also Read : అంబానీల నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చింది: అనన్యా బిర్లా
Follow Us On: X(Twitter)

