హిమాల‌యాల్లో ఇండియ‌న్ ఆర్మీ భారీ సాహ‌సం..!

క‌లం, వెబ్‌డెస్క్‌: హిమాల‌యాల్లో మంచు కొండ‌ల అంచున భార‌త సైన్యం (Indian Army) సాహ‌సోపేత‌మైన ఆప‌రేష‌న్ చేప‌ట్టి ఓ వ్య‌క్తి ప్రాణాల‌ను కాపాడింది. 18,600 అడుగుల ఎత్తులో చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ కావ‌డంతో భార‌త సైన్యంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ ఆపరేష‌న్‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళ్తే… ల‌ద్దాఖ్‌లోని హిమాల‌యాల్లో నున్‌-కున్ స‌మీపంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన కొండ వాలుపై ఓ వ్య‌క్తి చిక్కుకున్నాడు. స‌మాచారం అందుకున్న భార‌త సైన్యానికి చెందిన ఏవియేష‌న్ పైల‌ట్లు వెంట‌నే హెలీకాఫ్ట‌ర్‌తో అక్క‌డికి చేరుకున్నారు.

అయితే ఆ కొండ‌పైకి హెలీకాఫ్ట‌ర్ ద్వారా చేరుకోవ‌డం అసాధ్య‌మైన విష‌యం. దానిపై హెలీకాఫ్ట‌ర్ ల్యాండ్ అయ్యే అవ‌కాశం ఉండ‌దు. దీనికి తోడు ఆ స‌మ‌యంలో అక్క‌డ బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. ఈ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ వ్య‌క్తిని సురక్షితంగా రక్షించారు. అధిక ఎత్తులో జరిగే ఆపరేషన్లలో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీంతో ఇంజిన్ పని తీరు, రోటర్ లిఫ్ట్ సామర్థ్యం తగ్గిపోతాయి. దీనిని అధిగమించడానికి సైన్యం హెలికాప్టర్‌లోని అనవసరమైన పరికరాలను తొలగించి, మిషన్‌కు సరిపడా మాత్రమే ఇంధనాన్ని ఉంచుకున్నారు.

ఆ త‌ర్వాత‌ ఒక్క స్కిడ్‌పై మాత్ర‌మే వాలుపై ఆనుకునేలా హెలికాఫ్ట‌ర్‌ను ల్యాండ్ చేసి బాధితుడిని ర‌క్షించారు. ప‌గ‌టి వెలుతురు వేగంగా త‌గ్గిపోతున్న చివ‌రి స‌మ‌యంలో ఈ రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఇండియ‌న్ ఆర్మీ ఏవియేష‌న్ సిబ్బంది ధైర్య సాహ‌సాల‌కు, నైపుణ్యాల‌కు ఈ ఆప‌రేష‌న్ నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఆర్మీ సేవా భావాన్ని, ధైర్య సాహ‌సాల‌ను కొనియాడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>