కలం, స్పోర్ట్స్ : ఇండియా కార్టింగ్ సిరీస్ (India Karting Series-2026)లో మూడో, నాలుగో రౌండ్లు ఉత్కంఠగా ముగిశాయి. వివిధ విభాగాల్లో యువ డ్రైవర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సిరీస్ చివరి రౌండ్ ఈ నెల 31న బెంగళూరులో జరగనుంది. అండర్-10 విభాగంలో ఆరుత్రన్ ప్రభు పూర్తి ఆధిపత్యం చాటాడు. ప్రాక్టీస్, హీట్, సూపర్ హీట్, ఫైనల్ రేసుల్లో వరుసగా అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో తన ప్రచారాన్ని ఘనంగా ముగించాడు. జూనియర్ విభాగంలో చెన్నైకి చెందిన రెహాన్ ఖాన్ రషీద్ సత్తా చాటాడు.
వీకెండ్ మొత్తం వేగవంతమైన డ్రైవర్‌గా నిలిచిన అతడు సూపర్ హీట్, ఫైనల్ రేసుల్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో తొలి దశలో సహచరుడు ఆదిత్య ప్రతాప్ వెనుకబడినా, చివర్లో పుంజుకుని విజయాన్ని అందుకున్నాడు. మినీ విభాగంలో యూకేకు చెందిన రుద్ర గోకుల్‌నాథ్ ఫైనల్లో అద్భుత విజయం సాధించాడు. సూపర్ హీట్ విజేత శివ్ నీల్‌ను చివరి ల్యాప్‌లో అధిగమించి టైటిల్ దక్కించుకున్నాడు. దీంతో సూపర్ హీట్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
సీనియర్ విభాగంలో చెన్నైకి చెందిన కైరవ్ రాబర్సన్ అదరగొట్టాడు. సూపర్ హీట్, ఫైనల్ రెండింట్లోనూ అగ్రస్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన అర్మాన్ ధావన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మినీ, అండర్-10 విభాగాల పోటీలు ప్రేక్షకులను అలరించాయి. రుద్ర గోకుల్‌నాథ్, ఆరుత్రన్ ప్రభు మధ్య చివరి వరకు హోరాహోరీ పోరు సాగింది. 12 ల్యాప్‌ల ఫైనల్లో చివరి ల్యాప్‌లో రుద్ర అద్భుత ఓవర్టేక్తో విజయం సాధించాడు.
అయితే అండర్-10 విభాగంలో ఆరుత్రన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఐదు రౌండ్ల ఇండియా కార్టింగ్ సిరీస్‌కు ఈ నెల 31న బెంగళూరులోని మెకో కార్టోపియా సర్క్యూట్లో తెరపడనుంది. అక్కడ జరిగే చివరి రౌండ్‌తో ఈ సీజన్ ఛాంపియన్లు ఖరారు కానున్నారు.

