కలం, స్పోర్ట్స్ : చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డే (Ind vs Afg)లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. లక్ష్య ఛేదనలో భాగంగా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రికార్డు స్థాయిలో ఏకంగా 23 పరుగులు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శనతో 23 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. దీని వల్ల అఫ్గాన్ జట్టు 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆ జట్టు కెప్టెన్ షాహిదీ ఓపికగా ఆడి 102 పరుగులతో తన తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. అతనికి తోడుగా ఒమర్జాయ్ 50 పరుగులతో రాణించడంతో అఫ్గాన్ కోలుకుంది.
కానీ ఆ తర్వాత కేవలం 20 పరుగుల తేడాలోనే చివరి 5 వికెట్లు కోల్పోయి, అఫ్గానిస్తాన్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే అఫ్గాన్ కెప్టెన్ పిచ్ పైకి పదే పదే పరుగెత్తడంతో అంపైర్లు ఆ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో భారత్ 5/0 స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒమర్జాయ్ వేసిన మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. బౌలర్ వేసిన వైడ్లు, నో బాల్స్ భారత్‌కు బాగా కలిసొచ్చాయి. ఫ్రీ హిట్‌లను కూడా జైస్వాల్ ఫోర్లుగా మలిచాడు. దీంతో ఒకే ఓవర్లో 23 పరుగులు వచ్చి చేరాయి. గతంలో బంగ్లాదేశ్‌పై వచ్చిన 22 పరుగుల రికార్డును ఇది అధిగమించింది.

