కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో పార్కులు, చెరువులు, పబ్లిక్ భూముల ఆక్రమణలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరిస్తూ, మంగళవారం నగరం నలుమూలలా ఒకేసారి నాలుగు చోట్ల భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆక్రమణలను తొలగించి వెంటనే ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టింది.ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 1,100 గజాల మేర పార్కులను, మరోవైపు 1,100 ఎకరాల మేర చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) ప్రాంతాలను హైడ్రా కాపాడింది. ఇలా రక్షించిన భూమి మొత్తం విలువ సుమారు రూ.1,511 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
కొండాపూర్‌లో జంగం కుంటను కాపాడిన హైడ్రా..
శేరిలింగంపల్లి మున్సిపల్ (Serilingampally Municipality) కార్యాలయం – మదీనాగూడ రోడ్డు మార్గంలోని కొండాపూర్‌లో రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జంగం కుంటను పూడ్చి, మట్టితో చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు కబ్జాదారులు సిద్ధమవుతున్నారని మీడియా కథనాలు, స్థానిక ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా స్పందించింది. రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి చెరువుగా నిర్ధారించుకుంది. కబ్జాదారులపై రెవెన్యూ విభాగం కేసులు నమోదు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి, ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టారు.
అల్వాల్ కొత్త చెరువులో ఆక్రమణల తొలగింపు..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ (Alwal) మండలంలోని అల్వాల్ కొత్త చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో 8 ఎకరాల మేర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువును కలుషితం చేస్తూ ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు, తాత్కాలిక షెడ్లు, టెంటు సామగ్రి షట్టర్లు ఏర్పాటు చేసినట్లు స్థానికులు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు. వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నారని, చెరువు నీటిని కలుషితం చేస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలను ధృవీకరించారు.
ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో ఏవిధమైన నిర్మాణాలు, షెడ్లు అనుమతించరాదనే నిబంధనలు ఉల్లంఘనపై ఆక్రమణలను తొలగించారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహేబ్‌నగర్ కలాన్‌లోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. అదేవిధంగా మల్కాజిగిరి జోన్, మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్‌లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును కాపాడింది. జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ పార్కు స్థలంపై ప్రహరీ, రేకుల షెడ్ నిర్మాణాలను హైడ్రా (HYDRAA) తొలగించింది.
Read Also: కేసులకు భయపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
Follow Us On : WhatsApp


