కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన తనిఖీల్లో భాగంగా కేవలం ఒక్క వారంలోనే 1,940 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ మాట్లాడారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావొద్దని తల్లిదండ్రులను గట్టిగా హెచ్చరించారు.
మైనర్లు (Minors) డ్రైవింగ్ చేయడం వల్ల వారి ప్రాణాలకే కాకుండా, ఇతరులకు కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ఆయన సూచించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.

