కలం, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) పట్టణ పరిధిలోని వరంగల్ రోడ్డులో శుక్రవారం ఘోర కారు ప్రమాదం (Car Accident) చోటుచేసుకుంది. ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో శరవేగంతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ వైపు వెళ్తున్న కారు (TS 08 JB 6898) ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని, ఆ తర్వాత సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఒక హోటల్ భవనాన్ని ఢీకొని చివరకు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో వాహనంలో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. కారు దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న హుజూరాబాద్ (Huzurabad) పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఢిల్లీలో హైఅలర్ట్: రంగంలోకి 7వేల సీఆర్పీఎఫ్ బలగాలు!
Follow Us On : WhatsApp

