కలం, వెబ్ డెస్క్ : మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టును వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాలకు అన్యాయం చేయడమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth). మూసీ నదిని బీఆర్ ఎస్, బీజేపీ నేతలు కావాలనే వ్యతిరేకిస్తున్నారని.. ఒక్క సరైన కారణం కూడా చెప్పట్లేదని సీఎం విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదులను అక్కడ పునరుద్ధరించారు కానీ.. ఇక్కడ వ్యతిరేకించడం ఏంటని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బీఆర్ ఎస్, బీజేపీ నేతలకు కంటైనర్ హౌస్ లు ఇస్తానని.. 3 నెలల పాటు మూసీ పక్కన ఉంటే అప్పుడు ప్రజల సమస్య తెలుస్తుందన్నారు సీఎం రేవంత్. 200 మందికైనా తాను వసతి ఏర్పాటు చేస్తానని.. ముందుకు రావాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్.
మూసీ పక్కన ఎవరూ ఉండలేని పరిస్థితి వచ్చిందని.. అలాంటిది బీఆర్ ఎస్, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటూ రేవంత్ (Revanth) మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల సమస్యలు తాను కండ్లారా చూశాను కాబట్టే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు సీఎం. మూసీ పక్కన ప్రస్తుతం 10వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామని.. ఉపాధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు.
‘మూసీ ప్రాజెక్టుపై ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం రూ.5వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేశారు. కానీ మేం ఖర్చు పెడుతున్నది రూ.70 కోట్లే. ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం రూ.5 వేల కోట్ల నుంచి రూ.6వేల కోట్ల దాకా ఖర్చు అవుతాయి. కానీ రకరకాల బడ్జెట్ చెబుతూ తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మూసీ నదిని ఎవరు అడ్డుకున్నా ఆపేది లేదు’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

