కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాలా మందిలో చిన్న వయసులోనే ఐరన్, విటమిన్ డి, కాల్షియం లోపాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ లోపాలను సరిచేసుకోవడానికి డాక్టర్లను సంప్రదించాలి. కానీ చాలామంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలోని ఫిట్‌నెస్ ఇన్‌ఫ్టుయెన్సర్లు చెప్పే మాటలను నమ్మి కేవలం అందం, ఫిట్ నెస్ కోసం హెల్త్ సప్లిమెంట్ల (Health Supplements) ను విచ్చలవిడిగా వాడుతున్నారు.
ఇలా వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన అవగాహన లేకుండా సప్లిమెంట్లను మింగడం వలన కిడ్నీలు, లివర్ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సరైన రక్షపరీక్షలు లేకుండా, డాక్టర్ సలహా తీసుకోకుండా దీర్ఘకాలం పాటు సంప్లిమెంట్లు వాడటం అస్సలు మంచిది కాదని సూచిస్తున్నారు. కొన్నిసార్లు మనం వాడే ఇతర మందులతో ఈ సప్లిమెంట్లు వికటించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఉదాహరణకు విటమిన్ కె రక్తాన్ని పలచబరిచే మందుల పనితీరును అడ్డుకుంటుందట. అదే విధంగా కొన్ని రకాల మినరల్స్, మనం వేసుకునే యాంటీబయాటిక్స్ శరీరం గ్రహించకుండా చేస్తాయట.
సప్లిమెంట్లు కేవలం లోపాలను మాత్రమే పూరిస్తాయని, ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు. మన శరీరానికి కావాల్సిన అన్ని రకాలు పోషకాలు.. పండ్లు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగానే లభిస్తాయని సూచిస్తున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ సప్లిమెంట్లు వాడటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మితిమీరిన కాల్షియం.. కిడ్నీలకు ముప్పు
ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి కాల్షియం అవసరమే. అయితే మన శరీరంలో కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మనం కాల్షియం సప్లిమెంట్లు వాడాలి. కానీ, ఆహారం ద్వారా శరీరానికి సరిపడా కాల్షియం అందుతున్నప్పుడు కూడా అదనంగా హై డోస్ మాత్రలు వేసుకుంటే అవి కిడ్నీల్లో రాళ్లుగా (Kidney Stones) మారే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
2. విటమిన్ డి అతి వినియోగం.. ప్రాణాంతకం
శరీరంలో కాల్షియం గ్రహణ శక్తికి విటమిన్ డి అవసరం. అయినప్పటికీ దీన్ని పరిమితికి మించి తీసుకుంటే వికటిస్తుంది. శరీరంలో విటమిన్ డి ఎక్కువతే శాశ్వతంగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, అతి మూత్ర విసర్జన, మానసిక గందరగోళం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
3. ఐరన్ ( iron) సప్లిమెంట్ల దుష్ప్రభావాలు..
ఐరన్ సప్లిమెంట్లు శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా రక్తహీనత ఉన్నవారికి వైద్యులు ఐరన్ సప్లిమెంట్లను సిఫార్సు చేస్తారు. అయితే ఐరన్ లోపం లేనివారు ఈ సప్లిమెంట్లు తీసుకోవడం వలన లివర్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హైడోస్ ఐరన్ వల్ల కడుపునొప్పి, మలబద్ధకం, వికారం, వాంతులు, మల విసర్జన నల్లగా అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అందుకే ఫిట్ నెస్ లేదా అందం పేరుతో ప్రొటీన్ పౌడర్లు, మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడొద్దని, ముందుగా డాక్టర్ ను సంప్రదించి మీ సమస్య తెలుసుకుని డాక్టర్ సలహా మేరకు మాత్రమే సప్లిమెంట్లు వాడాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Note: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించబడింది. దీన్ని వైద్య సలహాగా భావించకూడదు. మీ ఆరోగ్య స్థితిని బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వైద్య నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం

