రాజ్యాంగం రాజ‌కీయ ప్ర‌చారానికేనా.. రాహుల్‌కు హ‌రీశ్ ఘాటు లేఖ‌!

క‌లం, వెబ్ డెస్క్‌: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ (MLA Defections)కు తెలంగాణ స్పీక‌ర్ క్లీన్ చిట్ ఇవ్వ‌డం, సుప్రీం కోర్టు ఈ కేసును ముగించ‌డం జ‌రిగిపోయింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన‌ట్లు ఆధారాలున్నా స్పీక‌ర్ క్లీన్ చిట్‌ ఇవ్వ‌డంపై బీఆర్ఎస్ (BRS) నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఓ బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో తన పార్టీ సాగిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన చర్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ అధికారిక బీ ఫామ్ మీద లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశార‌ని హరీష్ గుర్తుచేశారు.

ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయడం ఫిరాయింపు కాకపోతే ఏమిట‌ని ప్ర‌శ్నించారు. పదో షెడ్యూల్ కింద అసలు ఫిరాయింపు అంటే ఏమిటో రాహుల్ గాంధీ దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ విషయంలో స్పీకర్‌కు అన్ని ఆధారాలు సమర్పించినా, సాక్ష్యాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ఢిల్లీలో రాజ్యాంగ విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌, దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేయాలని మీరు సూచిస్తారా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంద‌ని ప్ర‌జ‌ల‌కు అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంద‌ని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం ప్రసంగాలకు పరిమితం కాకూడదని, రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నా దాన్ని అమ‌లు చేసి చూపించాల‌ని హరీష్ రావు హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>