కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఫ్యూచర్ సిటీ’ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు (Harish Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరుతామని గురువారం జరిగిన మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. తమ ప్రభుత్వం ఔషధ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఫార్మాసిటీ’ కోసం స్వయంగా తాను కూడా 17 ఎకరాల భూమిని ఇచ్చానని గుర్తు చేసిన హరీశ్ రావు.. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ కాకుండా ఏది కట్టినా అనుమతులు రద్దు ఖాయం అని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ నేతలు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని హారీశ్ రావు మండిపడ్డారు. ఇప్పుడు భూములను తిరిగి అయినా ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ అయినా కట్టండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఫార్మాసిటీ లేదనడంతో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి వెళ్లిపోయాయని ఫైర్ అయ్యారు.
‘ఫ్యూచర్ సిటీ’లో భాగంగా స్థానికుల నుంచే టోల్ వసూలు చేస్తారని హారీశ్ రావు చెప్పారు. ఇదే మాటను చెప్పి హెచ్ఎండీఏ రూ.10వేల కోట్లు అప్పు తెచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. పరిశ్రమల స్థాపన కోసం సేకరించిన విలువైన రైతుల భూములను, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్ కోసం వాడుతుందని.. ఇది కమీషన్ల ప్రభుత్వం అని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రియల్ దందాపై బీఆర్ఎస్ పోరాటం ఆపదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

