కలం, మెదక్ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల బుద్ధితో తెచ్చిన కరువని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నంగునూర్ మండలం తిమ్మాయ్‌పల్లి గ్రామంలో శనివారం జరిగిన పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. గోదావరి నదిలో కావాల్సినన్ని నీళ్లు ఉన్నా కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఈర్ష్యతో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
ఎంత కరువు వచ్చినా రైతాంగానికి నీరందించేలా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నిండి, సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు 70 నుండి 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు తిమ్మాయిపల్లిలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఎదురుచూసే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం బంగారు పంటలతో కళకళలాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు పట్టుదలను వీడి, వెంటనే కాళేశ్వరం మోటార్లను ఆన్ చేసి, ఈ కరువు కాలంలో గోదావరి జలాలను పారించేలా ఆ పెద్దమ్మ తల్లి ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు హరీష్ రావు తెలిపారు.

