Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందిరమ్మ పథకం భూమిపై ఆక్రమణ ప్రయత్నాలు.. కలెక్టర్‌కు రైతు వినతి

కలం, కరీంనగర్ బ్యూరో: ఇందిరమ్మ పథకంలో వచ్చిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల (Jagtial) జిల్లా గుట్రాజపల్లికి చెందిన రైతు కల్లేపల్లి గంగయ్య జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం కలెక్టరేట్‌లో అందజేసిన వినతి పత్రంలో గంగయ్య పేర్కొన్న వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామ శివారులోని సర్వే నెం. 439/12లో 33 గుంటల భూమి 20 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ భూ పంపిణీ ద్వారా తనకు లభించిందని, అప్పటి నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని పేర్కొన్నారు.

అట్టి భూమిని సాగుకు అనుకూలంగా చేసి అందులో బావి తవ్వి, కరెంట్ మోటార్ పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన కల్లేపల్లి అచ్చయ్య, గంగాధర్, నరేష్, రాజేశం, దేవదాస్ తదితరులు తనకు ప్రభుత్వం భూమి ఇచ్చిందని జీర్ణించుకోలేక ఆ భూమిని సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడి అండతో తనను బెదిరిస్తున్నారని, పొలం దగ్గరే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని రైతు వాపోయారు.

వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా సాగు చేసుకునేందుకు అధికారులు సహకరించాలని గంగయ్య కలెక్టర్ ను కోరారు. గతంలో రెండుసార్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుతం తనకు ప్రాణభయం ఉందని గంగయ్య తెలిపారు. అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ విషయమై కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ద్వారా జగిత్యాల రూరల్ తహశీల్దార్ కు ఫైల్ చేరినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>