కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చుట్టూ భారీగా ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేసేందుకు చూస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ ట్రేడింగ్ పుకార్ల నడుమే ముంబై ఇండియన్స్ సామాజిక మాధ్యమాల్లో హార్దిక్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ముంబయి చివరి స్థానం..
2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన హార్దిక్, 2022 సీజన్ ముందు ఆ జట్టును వీడి గుజరాత్ టైటాన్స్‌లో చేరారు. తొలి సీజన్లోనే గుజరాత్‌కు ట్రోఫీ అందించిన ఆయన, మరుసటి ఏడాది కూడా ఆ జట్టునే నడిపించారు. అనంతరం ట్రాన్స్ఫర్ విండో ద్వారా ముంబై ఇండియన్స్ అతడిని మళ్లీ సొంతం చేసుకుని సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే హార్దిక్ నాయకత్వంలో 2024 సీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2025లో క్వాలిఫయర్ 2 వరకు వెళ్లినా, 2026 సీజన్లో మాత్రం తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
గవాస్కర్ ఏమన్నారంటే..
ఈ పరిణామాల మధ్య ఐపీఎల్ ప్లేయర్ల ట్రేడింగ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆటగాళ్ల మార్పిడి జరిగినప్పుడు నంబర్లు కేవలం ఫ్రాంచైజీలు, ఆటగాడు, బీసీసీఐకి మాత్రమే తెలుస్తున్నాయని అన్నారు. దీనివల్ల ప్రతి జట్టుకు ఉండే సాలరీ క్యాప్ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారో లేదో ఇతర ఫ్రాంచైజీలకు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఐపీఎల్ ప్రతిష్ఠ కాపాడటానికి, ఈ ఆర్థిక వ్యవహారాల్లో సంపూర్ణ పారదర్శకత ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

