పుష్కర శోభకు మహోజ్జ్వల ప్రణాళిక!

కలం, ఖమ్మం బ్యూరో: ​మహా పుణ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam)తో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కర శోభకు సమర శంఖం పూరిస్తూ అధికారులు మహోజ్జ్వల ప్రణాళికతో రంగంలోకి దిగారు. రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మౌలిక వసతుల కల్పన, ఆలయాల పునర్నిర్మాణం, రవాణా సౌకర్యాల పునరుద్ధరణే లక్ష్యంగా భారీ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.

అధికారుల వీడియో కాన్ఫ‌రెన్స్‌

​ఈ మహా యజ్ఞంలో భాగంగా సోమవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు హైదరాబాద్ నుంచి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వం మంజూరు చేసిన పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ​పుష్కరాల పనుల్లో అలసత్వానికి తావులేకుండా, వివిధ శాఖల మధ్య స్పష్టమైన సమన్వయాన్ని ఏర్పరచడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, పోలీస్ ఆర్‌అండ్‌బీ శాఖలు ఒకే తాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేసేలా చర్యలు వేగవంతమయ్యాయి.

అందుబాటులోకి డిజిట‌ల్ యాప్‌

పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, సాంకేతికతను జోడిస్తూ త్వరలోనే ఒక ప్రత్యేక డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ యాప్‌లో ప్రతి వారం క్షేత్రస్థాయి వివరాలను నమోదు చేస్తూ, ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారాంతపు సమీక్షలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.

క‌ల్యాణోత్స‌వానికి 90 శాతం పూర్తి

​మరోవైపు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధికి ఒక నిర్దిష్టమైన కాలక్రమాన్ని సిద్ధం చేశారు. మొదటగా డిసెంబర్ నాటికి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లతో పాటు ముక్కోటి ఏకాదశికి వచ్చే భారీ భక్తజన సందోహానికి తగిన మౌలిక వసతులను పూర్తిచేసేలా ప్రణాళిక రూపుదిద్దారు. ఆ తర్వాత శ్రీరామనవమి కల్యాణోత్సవాల సమయానికి ఏకంగా 90 శాతం ప్రధాన అభివృద్ధి పనులను అందుబాటులోకి తెచ్చి, పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణాన్ని సంపూర్ణంగా ముగించేలా దేవాదాయ కమిషనర్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ​

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. కమిషనర్ సూచనల మేరకు జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భద్రాచల క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడుతూనే, పుష్కరాలకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల తాకిడికి తట్టుకునేలా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, రాకపోకల సదుపాయాలు విద్యుత్ ఏర్పాట్లను ముందస్తుగానే సమర్థవంతంగా సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా యంత్రాంగం రూపుదిద్దిన ఈ సమగ్ర ప్రణాళికలు అనుకున్న సమయానికి పూర్తయితే, రాబోయే గోదావరి పుష్కరాలు భక్తులందరికీ ఒక మరువరాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించడం ఖాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>